Thursday, December 30, 2010

టాలీవుడ్ కి మూడు అరిష్టాలు

ఏ ఏడాదీ లేనంతగా టాలీవుడ్ ఈ సంవత్సరం బోలెడు కష్టాలు ఎదుర్కొందు. అందులో మూడు ఇండస్ట్రీని మరీ దెబ్బతీశాయి. అవి... దీర్ఘకాల సమ్మె, డ్రగ్స్ భాగోతం, భారీఫ్లాపులు. మొదటిది ఆర్థికంగా దెబ్బకొడితే రెండోది పరువు తీసింది. మూడోది మాత్రం ఒకరకంగా నష్టమే చేసినా మరో రకంగా పరిశ్రమ వ్యక్తుల కళ్లు తెరిపించింది


దీర్ఘకాల సమ్మె... తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇంత సుదీర్ఘకాల సమ్మె గతంలో ఎప్పుడూ జరగలేదు. కోటశ్రీనివాసరావు వంటి పెద్దలు వాపోతున్నా సరే, మనవాళ్లను కాదని డాన్సర్లనూ ఫైటర్లనూ యాక్టర్లనూ... ఇలా సమస్తక్రాఫ్టుల వాళ్లనూ తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటున్న నిర్మాతలకు ఫైటర్లు తగిన బుద్ధే చెప్పారు. కానీ పరిస్థతి ముదిరి నిర్మాతలు షూటింగులు బంద్ చేస్తామనే దాకా వెళ్లింది. దీంతో షూటింగుల్లేక పాపం బడుగు కళాకారులు డొక్కలు ఎండిపోయాయి.

డ్రగ్స్ భాగోతం... సినిమా వాళ్లు తాగుతారనీ ‘తిరుగు’తారనీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్లు మడికట్టుక్కూర్చోరన్న విషయమూ తెలిసిందే. పూర్వం అందుకే సినిమావాళ్లంటే చులకనగా చూసేవాళ్లు. డ్రగ్స్ భాగోతం కూడా ఎప్పటి నుంచోనే ఉన్నా ఇంత భారీస్థాయిలో బయటపడింది మాత్రం ఈ ఏడాదే. పేర్లు మినహా డ్రగ్స్ వాడే నటీనటుల గురించి సవివరంగా వార్తల్లో వచ్చేయడంతో సినిమావాళ్ల మీదుండే చులకన భావం మరింత పెరిగింది.


భారీఫ్లాపులు... పక్క రోబో, యముడు ఆఖరికి ఆవారా కూడా మనదగ్గర బాగానే ఆడేస్తే మన ‘అగ్ర’ హీరోల సినిమాలు మాత్రం భారీస్థాయిలో బాల్చీతన్నేశాయి. కేడీ, పులి, ఖలేజా, ఆరెంజ్.. చెప్పకొంటూ పోతే బోలెడు. కాకపోతే ఈ దెబ్బలకు ఇండస్ట్రీ పెద్దల దిమ్మతిరిగినట్టే కనిపిస్తోంది. ఖర్చు తగ్గించడం గురించి మాట్లాడటం మొదలెట్టారు ఇప్పుడిప్పుడే. మాటల వరకూ సరేగానీ అది ఆచరణలోకి కూడా వస్తే బాగుణ్ను.
అప్పుడు 2011లోనైనా నాలుగు మంచి సినిమాలు చూడొచ్చు!

No comments:

Post a Comment